రాంచి: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేల బేరంలో బిజీబిజీగా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయించి.. జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నిన బీజేపీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ వ్యాపారవేత్తల పార్టీ అని, ఎమ్మెల్యేల అమ్ముడు, కొనుడులో ఆ పార్టీ చాలా బిజీగా ఉన్నదని విమర్శించారు. అక్రమ మైనింగ్ ఆరోపణలతో జార్ఖండ్ రాజకీయాలను కలుషితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని టిర్కీ ఆరోపించారు. ఈసీ సీల్డ్ కవర్లో ఇచ్చిన రిపోర్టులో సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసినట్లు బీజేపీ నేతలకు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జార్ఖండ్‌లో వారి ఆటలు సాగవని టిర్కీ హెచ్చరించారు. జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఎట్టి పరిస్థితుల్లో అస్థిరపర్చే అవకాశం బీజేపీకి ఇవ్వమని చెప్పారు.