లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింస వెనుక బీజేపీ ఉందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. (Sambhal violence) ఎన్నికల రిగ్గింగ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ హింసకు పాల్పడిందని విమర్శించారు. మొఘల్ కాలం నాటి జామా మసీదు సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో హింస చెలరేగింది. ముగ్గురు వ్యక్తులు మరణించగా, పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, సంభాల్‌లో జరిగిన హింసపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని విమర్శించారు.
మరోవైపు మసీదును ఇప్పటికే సర్వే చేయగా మళ్లీ ఎందుకు సర్వే చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. భావోద్వేగాలను ప్రేరేపించే ఉదయం సమయంలో ఎందుకు చేశారని నిలదీశారు. ఎన్నికల అక్రమాలపై చర్చలను అణచివేయడానికి ముందస్తు ప్లాన్‌లో భాగంగా ఈ హింస జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలనను నివారించడానికి ఇది ఒక పక్కా వ్యూహమని మండిపడ్డారు.