BJP observers : అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పనిలో బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ముందు బీజేఎల్పీ నాయకుడి ఎంపికపై దృష్టి సారించింది. అరుణాచల్ బీజేఎల్పీ నాయకుడి ఎంపిక బాధ్యతలను బీజేపీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, తరుణ్చుగ్లపై పెట్టింది. ఆ ఇద్దరిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలకుగాను 46 స్థానాల్లో విజయం సాధించింది. వాటిలో ఓ 10 స్థానాలైతే ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటిలో నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. మూడు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఎన్నికలకు ముందు 19 స్థానాలున్న కాంగ్రెస్ కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టబోతోంది. పెమా ఖండూనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఇద్దరు సీనియర్ నేతలను కేంద్ర పరిశీలకులుగా నియమించి అరుణాచల్ సీఎం ఎంపిక బాధ్యతను అప్పగించింది. రేపో, ఎల్లుండో అరుణాచల్ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై తమ శాసనాసభపక్ష నేతను ఎన్నుకోనున్నారు.