(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పొత్తులాట అడుతున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పీఠం ఎక్కడ చేజారుతుందోనన్న ఆందోళనలో బీజేపీ ఉంటే.. మరోసారి కేంద్రంలో గద్దెనెక్కాలనే ఆత్రుతలో కాంగ్రెస్ ఉన్నది. ఇందుకు ఇతర పార్టీలను పావులుగా చేసుకొని ఆటలు ఆడుతున్నాయి. రెండు పార్టీలకు అధికార యావ తప్ప.. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కనీసం చర్చ లేదు. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, రైతుల సమస్యల ఊసు అసలు లేదనే చెప్పాలి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సొంతంగా 10 రాష్ర్టాల్లో కూడా అధికారంలో లేదు. తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే కాంగ్రెస్ మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో అవసరం కాబట్టి బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీలను తమ వెంట నడువాలని దువ్వుతున్నాయి కానీ, ఈ రెండు పార్టీలూ ఏరుదాటాక ఓడ మల్లన్న బాపతేననే విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి, బలహీనం చేసి, విభజించి పాలించడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతాయనే విషయం గతంలో అనుభవపూర్వకమేనని గుర్తుచేస్తున్నారు.
bjp
విపక్ష కూటమికి ఎజెండా ఏది?
బెంగళూరులో భేటీ అయిన విపక్ష పార్టీలు.. నిర్మాణాత్మకంగా ఏ అంశంపైనా చర్చించలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ‘ఇదీ మా ఎజెండా’ అని చెప్పలేకపోయింది. విపక్ష కూటమికి పేరు పెట్టేందుకే ఈ సమావేశం పరిమితమైంది. దీనిపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. బీజేపీని గద్దె దించాలంటే నిర్ధిష్ట ఎజెండా ఉండాలి. అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపుతామో! స్పష్టంగా చెప్పాలి. కానీ విపక్షాల సమావేశంలో దీనిపై, ధరల పెరుగుదలపై చర్చించలేదని తెలిసింది.
కూటమి కాంగ్రెస్ హైజాక్
విపక్ష కూటమిని రెండో భేటీలోనే కాంగ్రెస్ హైజాక్ చేసిందనే వాదన వినిపిస్తున్నది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని విమర్శించిన పార్టీలు, కూటమి సారథ్యాన్ని తిరిగి ఆ పార్టీ చేతిలోనే పెట్టడం గమనార్హం. విపక్ష కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కాంగ్రెస్ సైడ్‌లైన్ చేసింది. నితీశ్‌కుమార్‌ను అవమానిస్తూ బెంగళూరులో వెలిసిన పోస్టర్ల వెనుక కేపీసీసీ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. పైగా విపక్ష కూటమికి నితీశ్ సూచించిన పేరు పెట్టలేదని ఆయన అలకబూనినట్టు సమాచారం. కూటమి ప్రెస్‌మీట్‌కు నితీశ్‌కుమార్ గైర్హాజరుకు ఇదే కారణమని అంటున్నారు. కన్వీనర్ పోస్టు ఇస్తారని నితీశ్ ఆశించినప్పటికీ, అది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఇద్దరి పేర్లే చర్చకు వచ్చినట్టు సమాచారం. దీంతో నితీశ్‌కుమార్‌కు మద్దతు ఇస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.
పేరుపైనా వివాదమే
కూటమి పేరును ‘ఐఎన్డీఐఏ(ఇండియా)’ అని పెట్టడం కూటమిలోని కొన్ని పార్టీలకు నచ్చలేదని తెలుస్తున్నది. వాస్తవానికి కూటమికి పేట్రియాట్రిక్ డెమొక్రటిక్ అలయన్స్ (పీడీఏ) అని పేరు పెడుతున్నట్టు పాట్నాలో జరిగిన మొదటి భేటీలో తెరపైకి వచ్చింది. తాను సూచించిన పేరును పక్కనపెట్టి ఇండియాగా మార్చడం నితీశ్‌కుమార్ ఇష్టం లేదని తెలిసింది. విపక్ష కూటమికి మొదట ‘ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్’గా పేరు ఖరారు అయినట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు టీఎంసీ నేతలు కూడా ట్వీట్ చేశారు. అయితే ఇందులో డెమోక్రటిక్ పదం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎన్డీయే)కు దగ్గరగా ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభ్యంతరం చెప్పడంతో డెమోక్రటిక్ పదాన్ని తొలిగించి దాని స్థానంలో డెవలప్మెంటల్ అనే పదాన్ని చేర్చడానికి కాంగ్రెస్ ఓకే చెప్పడం కూడా కొందరి నేతలకు రుచించలేదని తెలిసింది.
కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా 11 పార్టీలు
కాంగ్రెస్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన కూటమిలో కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరకుండా.. 11 పార్టీలు తటస్థంగా ఉన్నాయి. ఈ పార్టీలకు 91 మంది ఎంపీలు ఉన్నారు. రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీల జాబితాలో కీలకమైన తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ ఉన్నాయి. దక్షిణాదిలో ప్రధాన రాష్ర్టాలుగా ఉన్న తెలంగాణ, ఏపీ, ఒడిశాలతో మొత్తంగా కలిపి 63 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ పార్టీలే కాకుండా ఏ కూటమిలో లేని పార్టీలలో బీఎస్పీ, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్, టీడీపీ, ఏఐయూడీఎఫ్, జనతాదళ్ సెక్యూలర్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీలు ఉన్నాయి. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలోని బీజూ జనతాదళ్ బీజేపీ సర్కార్‌కు అనుకూలమనే ముద్ర ఉన్నది. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి (2014) వచ్చిన నాటి నుంచి ఏ కూటమిలో చేరకుండా సమదూరాన్ని పాటిస్తూ వస్తున్నది.