NDA | కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన్న జేడీయూ మద్దతు లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా అసాధ్యం. ఈ నేపథ్యంలో బీజేపీకి తమతో ఉన్న అవసరాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. బీజేపీ ముందు తమ షరతులు పెట్టాలని భావిస్తున్నారు.
ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నది టీడీపీకే. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి కీలక పదవుల కోసం టీడీపీ పట్టుబట్టనున్నది. ముఖ్యంగా కేంద్రజల్ శక్తి శాఖను తెలుగుదేశం అడిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఏపీ జీవనాడి పోలవరం పూర్తికావాలంటే.. కేంద్రం సహకారం ఎంతో అవసరమని, ఈ నేపథ్యంలోనే జలశక్తి శాఖను కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే మొత్తం ఐదు మంత్రి పదవులను టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. లోక్‌సభ స్పీకర్ పదవితో పాటు రవాణా,వ్యవసాయం, జలశక్తి, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యశాఖలను కోరుతున్నట్లు సమాచారం. మూడు క్యాబినెట్ మంత్రిపదవులతో పాటుగా.. రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు 2014లోనూ టీడీపీ.. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అయితే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగా.. వీరు కూడా వారి మంత్రి పదవులను వదులుకున్నారు.
12 ఎంపీ సీట్లు గెలిచిన జేడీయూకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి కావాలని నితీశ్ బీజేపీని అడగబోతున్నారని జేడీయూ నేతలు చెప్తున్నారు. అందులోనూ రైల్వే, గ్రామీణాభివృద్ధి, జల్‌శక్తి వంటి కీలక శాఖలపై పట్టుబట్టాలని నితీశ్ భావిస్తున్నారని ఓ జేడీయూ నేత తెలిపారు. ఈ కీలక శాఖలు దక్కితే బీహార్‌కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తీసుకువచ్చే అవకాశం ఉంటుందని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని నితీశ్ భావిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ఫలితాల ముందే మూడు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని డిమాండ్లు కూడా బీజేపీ ముందు పెట్టాలని నితీశ్ భావిస్తున్నారట. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, దేశవ్యాప్తంగా కులగణనకు పట్టుబట్టాలని ఆయన నిర్ణయించారని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల 94 లక్షల పేద కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు ప్రారంభించిన ‘బీహార్ లఘు ఉద్యమి యోజన’ పథకానికి సైతం భారీ నిధులను కేంద్రం ఇచ్చేలా ఒత్తిడి చేయాలని నితీశ్ భావిస్తున్నారట.
