Nitish @ Tejaswi Home | రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. బొచాన్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ ఘన విజయం సాధించిన తర్వాత తేజస్వి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు నితీశ్ కుమార్ హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. నితీశ్‌తోపాటు బీజేపీ నేత అవధేశ్ నారాయణ్ సింగ్, సయ్యద్ షాహానవాజ్ హుస్సేన్, లోక్‌జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి, తల్లి రబ్రీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తేజస్వి యాదవ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు ఆర్జేడీ నేత ఇంటికి నితీశ్ ఐదేండ్ల తర్వాత తొలిసారి వచ్చారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహా కూటమితో తెగదెంపులు చేసుకుని 2017లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీశ్ కుమార్, లాలూ యాదవ్ కుటుంబం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సీఎం అధికార నివాసానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రబ్రీదేవి ఇంటికి నితీశ్ కాలి నడకన హాజరు అయ్యారు.
2020 అక్టోబర్‌లో రాం విలాస్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించిన తర్వాత చిరాగ్ పాశ్వాన్, నితీశ్ కుమార్ కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్ పాదాలను చిరాగ్ పాశ్వాన్ తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.