Yogendra Yadav | న్యూఢిల్లీ, మే 13: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, ఆ కూటమి 268 సీట్లు దాటవని ప్రముఖ సెఫాలజిస్ట్, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని మీడియా, రాజకీయ విశ్లేషకులు అంతా కలిసి ‘మళ్లీ గెలిచేది మోదీనే’ అనే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని, ఈ అబద్ధాన్ని బద్ధలు కొట్టి ప్రజలకు నిజం తెలియాలనే ఈ విషయాన్ని చెప్తున్నానని పేర్కొన్నారు. గతంలో తాను భవిష్యత్తును అంచనా వేసే పని చేసేవాడినని, ఇప్పుడు భవిష్యత్తును నిర్మించే పని చేస్తున్నట్టు చెప్పారు. తాను ఇటీవల కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేశానని తెలిపారు.
2019లో బీజేపీకి ఒంటరిగా 303, ఎన్డీయేకి 353 సీట్లు రాగా ఈసారి భారీగా తగ్గనున్నట్టు యోగేంద్ర చెప్పారు. కర్ణాటకలో కనీసం 10 స్థానాలు, మహారాష్ట్రలో 10 స్థానాలు, రాజస్థాన్, గుజరాత్ కలిపి 10 స్థానాలు తగ్గనున్నట్టు అంచనా వేశారు. హర్యానా, పంజాబ్, ఛండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో కలిపి 10 స్థానాలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కలిపి 10 స్థానాలను ఎన్డీఏ కోల్పోతుందన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కలిపి 15 సీట్లు, బీహార్లో 15 సీట్లు, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మరో 10 స్థానాలు తగ్గుతాయన్నారు. కాగా, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కలిపి 5 సీట్లు పెరుగొచ్చని, ఆంధ్రప్రదేశ్లో 10 సీట్లు పెరుగుతాయని చెప్పారు. మొత్తంగా బీజేపీకి ఒంటరిగా 233 స్థానాలు, ఎన్డీయేకు 268 సీట్లకు మించి రావని చెప్పారు.