భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు భారత వాయుసేన ధ్రువీకరించింది. ఉత్తరాఖండ్‌లోని పారిలో జన్మించిన ఆయన కుటుంబం నాలుగు తరాలుగా భారత ఆర్మీకి సేవ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తొలి త్రివిధ దళాధిపతిగా భారత ప్రభుత్వం ఆయన్ను నియమించింది.
అంతకుముందు వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.
దీని కన్నా ముందు 2016 డిసెంబరు 31న 26వ భారత ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీ స్వీకారం చేశారు. అంతకన్నా ముందు భారత ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీవోఏఎస్)గా సేవలందించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీల్లో ఆయన చదువుకున్నారు.
అనంతరం 1978లో ఇండియన్ మిలటరీ అకాడమీ ఆయన్ను ఆర్మీలోని ఎలెవెన్ గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఐదో బెటాలియన్‌కు పంపించింది. ఇక్కడ ఆయన అందించిన సేవలకుగానూ ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. హైఆల్టిట్యూడ్ యుద్ధాలు, చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో రావత్‌కు ఎంతో అనుభవం ఉంది.
ఈస్టర్న్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి ఇన్ఫాంట్రీ బెటాలియన్‌కు కూడా ఆయన కమాండర్‌గా సేవలందించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, మోలోని ఆర్మీ వార్ కాలేజీలో శిక్షకుడిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలంపాటు భారత రక్షణ వ్యవస్థకు సేవలందించిన ఆయన.. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (యూవైఎస్ఎమ్), అతి విశిష్ట సేవా మెడల్ (ఏవీఎస్ఎం), యుద్ధ సేవా మెడల్ (వైఎస్ఎం), సేన మెడల్ (ఎస్ఎం), విశిష్ట సేవా మెడల్ (వీఎస్ఎం), చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) కమెండేషన్ తదితర పతకాలు అందుకున్నారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో కూడా ఆయన చదువుకున్నారు. ఇక్కడ హైయర్ కమాండ్ అండ్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్ చేశారు. అమెరికాలోని కన్సాస్‌లో ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో నిర్వహించిన కాండ్ అండర్ జనరల్ స్టాఫ్ కాలేజ్ (సీజీఎస్‌సీ) కోర్సుకు కూడా ఆయన హాజరయ్యారు.
జాతీయ భద్రత, నాయకత్వం వంటి అంశాలపై ఎన్నో ఆర్టికల్స్ రచించారు. వీటిలో కొన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలోనే మద్రాస్ యూనివర్సిటీ నుంచి రక్షణ విద్యలో ఎం.ఫిల్ అందుకున్నారు. మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలు కూడా చేశారు. మిలటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు మీరట్‌లోని చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
వెల్లింగ్టన్ (నీలగిరి హిల్స్)లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో స్టాఫ్ కోర్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి బుధవారం నాడు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉపన్యసించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి భార్యతో కలిసి బుధవారం మద్యాహ్నం సలూర్ ఎయిర్‌బేస్ నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన బయలుదేరారు. వీరితోపాటు ఆ హెలికాప్టర్లో ఇతర అధికారులు కూడా ఉన్నారు. అయితే కూనూర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటన రావత్, ఆయన భార్య సహా పలువురు దుర్మరణం పాలయ్యారు.