బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో పరిస్థితులపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గురువారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో, ఈ నగరంలో మంచి వాతావరణం, ప్రతిభావంతులు ఉన్నారని, అయితే, రోడ్లు, చెత్త కుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాల సమస్యలను పరిష్కరిస్తే, ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే గొప్ప అవకాశం గ్రేటర్ బెంగళూరు అథారిటీకి ఉందన్నారు. ఉమ్మడి సంకల్పంతో దీనిని సాధిద్దామని పిలుపునిచ్చారు.
సరిదిద్దుతున్నాం : డీకే
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కిరణ్ షా వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆమె ఆవేదనతో ఏకీభవించారు. అయితే, రాజకీయ దృఢ సంకల్పం లేదని, ఆ కొరతను ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పారు. రోడ్లు, చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు, ప్రణాళిక వంటి వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అత్యవసర ప్రాతిపదికపై పని చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు కోసం ప్రజలు, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, పౌర సమాజం కలిసికట్టుగా కొత్త అధ్యాయాన్ని లిఖించాలని పిలుపునిచ్చారు. డీకే శివ కుమార్ పోస్ట్‌కు కిరణ్ షా బదులిస్తూ, “అత్యవసర భావనతో మనం ఆ పని చేద్దాం” అని చెప్పారు.
కిరణ్ షా పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ, బెంగళూరు నగరాన్ని మెరుగుపరచడానికి సలహాలు ఇచ్చారు. ప్రజల అలవాట్లు, నాగరికత భావన, ట్రాఫిక్ నిబంధనలు, మౌలిక నడవడిక, తోటి భారతీయులకు మద్దతుగా నిలబడటం వంటివి చేయాలని ఓ యూజర్ చెప్పారు. వీటిని సరిదిద్దితే, మిగిలినవన్నీ సాధ్యమవుతాయన్నారు. ట్రాఫిక్, కాలుష్యం, చెత్త, రోడ్లు, అవినీతి, సరస్సులు, అటవీ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు… ఇలా బెంగళూరు నగర సమస్యల జాబితాకు అంతులేదన్నారు. అధికారం, డబ్బు, మద్యానికి బానిసలైనవారు చెప్పుకోదగిన పనులేమీ చేయలేరన్నారు. బెంగళూరును మనం ప్రేమించినంతగా ప్రేమించే నాయకుడిని కనీసం ఒకరినైనా తాను చూడలేదన్నారు.