న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రపంచవ్యాప్తంగా యువత మూడు పదులు దాటుతున్నా పెండ్లి చేసుకునేందుకు తటపటాయిస్తుండగా, పెండ్లి చేసుకున్న కొత్త జంటలు సైతం పిల్లలు ఇప్పుడే వద్దంటూ వాయిదాలు వేసుకుని పోతుంటే ప్రపంచ కుబేరులు కొందరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తుండడం విశేషం. ఏకపత్నీ సిద్ధాంతాన్ని దూరం పెట్టిన కొందరు సంపన్నులు పెండ్లి మీద పెండ్లి చేసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటూ పోతుండగా మరికొందరు మాత్రం ఐవీఎఫ్, సరగసీ(అద్దె గర్భం), వీర్య దానంతో డజన్ల కొద్దీ సంతానాన్ని, కొందరైతే వందలాది పిల్లల్ని కంటూ ప్రపంచ జనాభా పెరిగేందుకు తమ శాయశక్తులా శ్రమిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుపొందిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు 14 మంంది సంతానం. తన యావదాస్తిని తన 100కిపైగా సంతానానికి సమానంగా పంచిపెడతానని మరో కుబేరుడు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రకటించారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం అమెరికాలోని టాప్ 100 మంది కుబేరులకు సగటున మూడు లేక అంత కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నది. వీరిలో ఎలాన్ మస్క్ ముందంజలో ఉన్నారు. నలుగురు భార్యల ద్వారా 14 మందికి మస్క్ తండ్రయ్యారు.
ఇక రష్యాలో జన్మించిన టెక్ దిగ్గజం, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు మూడు వేర్వేరు భాగస్వాముల ద్వారా ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరుగాక 12 దేశాల్లో వీర్యదానం చేయడం ద్వారా 100 మందికిపైగా పిల్లలకు తండ్రయ్యాడు. తాను సంపాదించిన రూ. లక్ష కోట్ల ఆస్తిని తన పిల్లలందరికీ సమానంగా పంచిపెడతానని దురోవ్ ఇటీవలే ప్రకటించాడు. ఇక చైనా గేమింగ్ కంపెనీ వాంగ్జో దువోయే నెట్వర్క్ యజమాని జూ బో వీర్యదానం ద్వారా 12 మంది అమెరికన్ పిల్లలకు తండ్రయ్యాడు. మొత్తంగా అతనికి 100 మందికిపైగా పిల్లలున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. జూ బోకు 300 మందికిపైగా పిల్లలు ఉండవచ్చని అతని మాజీ ప్రేయసి వెల్లడించడం విశేషం.
ఎందుకు ఇందరు పిల్లలు?
పెద్ద సంఖ్యలో తాము పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడానికి తగ్గిపోతున్న ప్రపంచ జనాభాయే ప్రధాన కారణమని ఈ కుబేరులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కన్నా క్షీణిస్తున్న జనాభానే మానవాళికి అతిపెద్ద ముప్పని ఎలాన్ మస్క్ వాదిస్తున్నారు. సంతానం లేని వారిని భర్తీ చేసేందుకు ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని ఈ ఏడాది జూలైలో ఆయన ఎక్స్‌లో పిలుపునిచ్చారు. జూ బో మాత్రం తన సంపదను అనుభవించడానికి వారసులు ఉండాలనే తాను అధిక సంతానాన్ని పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు. చైనా నిబంధనల ప్రకారం గరిష్ఠంగా ముగ్గురు పిల్లలు మాత్రమే కుటుంబానికి ఉండాలి.
ఈ కారణంగానే అమెరికాలో సరగసీ ద్వారా పిల్లలకు తండ్రయిన జూ బో తన పిల్లలకు, ఎలాన్ మస్క్ పిల్లలకు జోడీ కుదిరితే బాగుంటుందని ఆసక్తిని కనబరుస్తున్నారు. వాతావరణ కాలుష్యం, పర్యావరణ కారణాల వల్ల యువతలో సంతానోత్పత్తి తగ్గిపోతోందని పావెల్ దురోవ్ విశ్వసిస్తున్నారు. తన వీర్యం ద్వారా పిల్లల్ని కనేందుకు సిద్ధపడే 38 ఏండ్ల లోపు మహిళలకు ప్రసూతి ఖర్చులను తానే పూర్తిగా భరిస్తానని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో శిశు జననాల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నది. 2070 నాటికి 65 ఏండ్లు పైబడిన జనాభా 220 కోట్లకు చేరుతుందని, యువజనుల సంఖ్య మాత్రం బాగా తగ్గిపోతుందని అంచనా.