చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ కీలక నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి కాకుండా కేవలం అమృత్సర్ ఈస్ట్ నుంచి మాత్రమే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మజీతియా ఒక ప్రకటన కూడా చేశారు. మజీతియా 2007 నుంచి వరుసగా మజీతా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూను ఓడించడానికి మజీతియాను అమృత్సర్ ఈస్ట్‌లో కూడా బరిలో దించాలని శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది.
అ మేరకు మజీతియా ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే, ఇటీవల అమృత్సర్ ఈస్ట్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు స్థానాల నుంచి గెలిస్తే ఏ స్థానాన్ని వదులుకుంటారని స్థానిక ఓటర్లు మజీతియాను ప్రశ్నించారు. దాంతో అమృత్సర్ ఈస్ట్‌ను వదులుకోనని చెప్పిన ఆయన.. కేవలం ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మజీతా నియోజకవర్గం నుంచి ఆయన భార్య గనీవే కౌర్‌ను బరిలో దించనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్‌సింగ్ సిద్ధూ కూడా మజీతియాకు సవాల్ విసిరారు. దమ్ముంటే మజీతియా రెండు స్థానాల్లో కాకుండా తనను ఓడించాలనుకుంటున్న అమృత్సర్ ఈస్ట్ నుంచే పోటీచేయాలన్నారు. తాజా నిర్ణయంతో మజీతియా సిద్ధూ సవాల్‌ను కూడా స్వీకరించినట్లయ్యింది. మజీతా స్థానం నుంచి ఈ నెల 4న మజీతియా నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు.