పాట్నా: బిచ్చగత్తె ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు, విదేశీ నాణేలు, ఇతర విలువైన వస్తువులు చూసి షాకయ్యారు. (Cops Raid Beggar’s Home) అడుక్కునే నెపంతో ఆ మహిళ రెక్కీ నిర్వహించగా ఆమె అల్లుడు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ బిచ్చగత్తెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడి కోసం వెతుకుతున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నీలం దేవి అనే మహిళ పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అడుక్కునేది. కొన్నిసార్లు దోమతెరలు అమ్మేది.
కాగా, ఆయా ప్రాంతంలో పలు చోరీలు జరుగడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. బిచ్చగత్తె నీలం దేవిని అనుమానించి ఆమె ఇంటిపై రైడ్ చేశారు. విలువైన బైక్, ఖరీదైన 12 మొబైల్ ఫోన్లు, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్, కువైట్ వంటి పలు దేశాలకు చెందిన వెండి నాణేలు, బ్రిటీష్ కాలం నాటి నాణేలు, బంగారు గొలుసు, ఇతర ఆభరణాలు ఆ మహిళ ఇంట్లో లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నాడు.
మరోవైపు నీలం దేవిని పోలీసులు ప్రశ్నించారు. యాచించే నెపంతో రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న, ఇతర ఇళ్ళను ఆమె గుర్తించేదని తెలుసుకున్నారు. ఆమె అల్లుడు చుతుక్ లాల్ తన అనుచరులతో కలిసి ఆయా ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బిచ్చగత్తె నీలం దేవిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అతడి అరెస్ట్ తర్వాత మిగతా నిందితులు ఎవరన్నది తెలుస్తుందని అన్నారు.