కోల్కతా: ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, పశ్చిమబెంగాల్ వాసి వికాస్ సిన్హా (Bikash Sinha) ఇక లేరు. 78 ఏళ్ల వికాస్ సిన్హా గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోల్కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అణు భౌతిక శాస్త్ర విభాగంలో ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
అదేవిధంగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల (2022లో) ఆయనను రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ‘బంగభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలకు గుర్తింపుగా 2022లోనే రవీంద్ర స్మృతి పురస్కారాన్ని కూడా అందజేసింది. కాగా, వికాస్ సిన్హా మృతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.