న్యూఢిల్లీ : రైల్లో ప్రయాణికులతో మాటలు కలిపి, వాళ్లతో స్నేహంగా ఉంటూనే దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఓ బీహార్ యువకుడు. రైలు ప్రయాణికులతో లూడో గేమ్ ఆడుతూ..వారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకోవటం, ఆ తర్వాత నిద్రమాత్రలు ఇచ్చి వారి సర్వం దోచుకోవటం ఇతడి ైస్టెల్! ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ జీఆర్పీ పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. నిందితుడు బీహార్‌లోని దర్భాంగకు చెందిన సాగిర్‌గా పోలీసుల విచారణలో తేలింది. అతడి వద్ద 8 ఫోన్లు, రెండు ఆధార్ కార్డులు, నిద్ర గోలీలు, ఓ బ్యాగు, 67,150 నగదు లభ్యమయ్యాయి. బీహార్‌కు వెళ్లే వైశాలీ ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ప్రయాణికులను సాగిర్ టార్గెట్ చేస్తుంటాడు. స్లీపర్, జనరల్ బోగీల్లోని ప్రయాణికులతో మాటలు కలిపి, వారికి నిద్ర మాత్రలు ఇచ్చి..వారి వద్ద ఉన్న నగదు, ఏటీఎం కార్డులు, ఫోన్లు, విలువైన వస్తువులు దొంగలించేవాడని పోలీసులు చెప్పారు.