పాట్నా, జులై 3: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ హత్యను పోలిన మరో ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయిన 45 రోజులకే భర్తను హత్య చేయించిన ఓ నవ వధువును పోలీసులు అరెస్టు చేశారు. మేనత్త భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న గుంజాదేవి అతనితో కుమ్మక్కై కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాంశుతో గుంజాదేవికి నెలన్నర క్రితం వివాహమైంది.
పెళ్లికి ముందే గుంజాదేవికి తన మేనత్త భర్త జీవన్ సింగ్(55)తో సంబంధం ఉంది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించగా ఇరు కుటుంబాలు దీనికి ఒప్పుకోలేదు. ప్రియాంశుతో గుంజాదేవికి బలవంతంగా పెళ్లి చేయించారు. జూన్ 25న తన సోదరిని చూసేందుకు వెళ్లి రైలులో తిరిగి వస్తున్న ప్రియాంశు నవీ నగర్ స్టేషన్కు చేరుకున్న తర్వాత తన భార్యకు ఫోన్ చేసి తనను పికప్ చేసుకోవడానికి ఎవరినైనా బైక్ ఇచ్చి పంపాలని కోరాడు.
స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రియాంశుపై కాల్పులు జరపగా ఆయన అక్కడికక్కడే మరణించాడని ఎస్పీ అమ్రిష్ రాహుల్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత గ్రామం నుంచి పారిపోవడానికి గుంజాదేవి ప్రయత్నించగా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆమెను అడ్డుకున్నారు. గుంజాదేవి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు ఆమె తరచు జీవన్ సింగ్తో ఫోన్ సంభాషణలు సాగించినట్లు గుర్తించారు.