బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బీహార్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగింది. (woman raped near railway station) వెంట ఉన్న సోదరుడి వరుస వ్యక్తిని అడ్డుకుని ఆమెను లాక్కెళ్లారు. రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతంలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువతి కేరళలోని ఎర్నాకుళంలో పని చేస్తున్నది. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు రైలులో బెంగళూరుకు బయలుదేరింది. ఏప్రిల్ 2న తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో కజిన్‌కు ఫోన్ చేసింది. అతడి సూచన మేరకు కేఆర్‌పురం రైల్వే స్టేషన్లో ఆమె దిగింది.
కాగా, రైలు దిగిన ఆ యువతి తన కజిన్‌ను కలిసింది. ఫుడ్ కోసం అతడితో కలిసి రైల్వే స్టేషన్ బయటకు వచ్చింది. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఒక వ్యక్తి కజిన్‌ను పట్టుకోగా, మరో వ్యక్తి ఆ యువతిని సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు యువతి కేకలు విన్న స్థానికులు స్పందించారు. ఆ యువతిని కాపాడారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడ్ని ప్రశ్నించిన తర్వాత మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆసిఫ్, కజిన్‌ను అడ్డుకున్న సయ్యద్ ముషార్ను నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.