Bride’s cousin died : వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధువు కుటుంబం (Bride family) లో సంబురాలు చేసుకుంటున్న సమయంలో ఆమె బంధువుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరుపగా.. వధువు కజిన్ (Bride’s cousin) బ్రదర్ ప్రాణాలు కోల్పోయాడు. బీహార్ రాష్ట్రం (Bihar state) రోహ్తాస్ జిల్లా (Rohtas district) లోని శివసాగర్ పోలీస్‌స్టేషన్ (Shivsagar police station) పరిధిలోని తన్వా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తన్వా గ్రామంలో వివాహ వేడుకలకు బంధువులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వధువు ఇంట్లో సంబురాలు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంటకు బంధువుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపారు. పొరపాటున బుల్లెట్ వధువు కజిన్ బ్రదర్ నందన్ కుమార్ సింగ్‌కు తగలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా కాల్పుల్లో మరణించిన వ్యక్తి బక్సర్ జిల్లాలోని మిడిల్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.