Shocking | చిన్న చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్లు ఆడేది ఓ మంత్రి తనయుడి ఫాం హౌజ్‌లో. దీంతో ఆ మంత్రి తనయుడికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చిన్న పిల్లలను భయపెట్టడానికి ఏకంగా గాల్లోకి కాల్పులే జరిపాడు. ఈ సంఘటన బిహార్‌లోని హరిద్వాలో జరిగింది. ఆ ప్రబుద్ధుడు బిహార్ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నేత నారాయణ్ ప్రసాద్ కుమారుడు. ఆయన పేరు బాలు ప్రసాద్. తన ఫామ్‌లో క్రికెట్ ఆడుతున్న వారిని ఖాళీ చేయమని అడగడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ మంత్రి కుమారుడు బాలు ప్రసాద్ తమను కొట్టారని, గాయాలు కూడా అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు. అలాగే గాల్లోకి కాల్పులు కూడా జరిపాడని పేర్కొంటున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. మంత్రి నారాయణ ప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. ఆందోళన నిర్వహించారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. మంత్రి కుమారుడు బాలు ప్రసాద్‌ను చితకబాదారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే మంత్రి నారాయణ్ ప్రసాద్ వాదన మరోలా వుంది. గ్రామస్థులందరూ కలిసి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్లాన్ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన సోదరుడిపై గ్రామస్థులు దాడి చేశారని మంత్రి నారాయణ్ ప్రసాద్ ఆరోపిస్తున్నారు.