న్యూఢిల్లీ: యావత్‌దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 14న ఫలితాలను ప్రకటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలో ఎన్డీయే, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ మధ్య ఈసారి హోరాహోరీ పోరు సాగనున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీ కూడా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. బీహార్‌లో మొత్తం 243 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి దశలో 121 నియోజకవర్గాల్లో, రెండో దశలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత శాసన సభ పదవీ కాలం వచ్చే నెల 22న ముగుస్తుంది.
7.42 కోట్ల మంది ఓటర్లు
ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. అర్హులైన ఓటర్లు 7.42 కోట్లు అని, వీరిలో 3.92 కోట్ల మంది పురుషులు కాగా, 3.5 కోట్ల మంది మహిళలు అని తెలిపారు. 14 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందినవారని, 4 లక్షల మంది సీనియర్ సిటిజన్లు అని వివరించారు. 100 ఏళ్ల వయసు పైబడినవారు సుమారు 14,000 మంది ఉన్నట్లు తెలిపారు. హింసకు తావులేకుండా, ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు లేదా అభ్యర్థులకు హాని జరిగే అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గుర్రాలపై గస్తీ, పడవలపై పోలింగ్ సిబ్బంది ప్రయాణం
దియారా ప్రాంతంలోని 250 పోలింగ్ బూత్‌లలో పోలీసులు గుర్రాలపై గస్తీ తిరుగుతారని జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. 197 పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడానికి పోలింగ్ సిబ్బంది పడవలను ఉపయోగిస్తారన్నారు. మొత్తం 90,712 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ జరుగుతుందన్నారు.
పోలింగ్ బూత్‌ల వద్ద మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు
పోలింగ్ బూత్‌ల వద్ద ఫోన్లను భద్రపరచేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించే ద్వారం వద్ద సిం పుల్ పీజియన్ హోల్ బాక్సు లు లేదా జూట్ బ్యాగులను ఇ స్తారని, ఓటర్లు తమ ఫోన్లను వాటిలో పెట్టి, డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై పిటిషన్లు దాఖలైనపుడు పోలింగ్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్‌ను సంబంధిత హైకోర్టులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుందని సీఈసీ చెప్పారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ రికార్డులను బహిరంగంగా పంచుకోవడం వల్ల ఓటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్ కూడా ఫారం 17ఏ వంటిదేనన్నారు. ఓటర్ల గుర్తింపును పరిరక్షించడం కోసం ఫారం 17ఏను కూడా రాజకీయ పార్టీలకు అందజేయరనే విషయాన్ని గుర్తు చేశారు. బురఖా ధరించిన మహిళలను గుర్తించేందుకు అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని సీఈసీ చెప్పారు.
17 కొత్త సంస్కరణలు
బీహార్ శాసన సభ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలను అమలు చేస్తున్నారు. వీటిని దేశవ్యాప్తంగా ఇకపై అమలు చేస్తారు. వీటిలో ముఖ్యమైనవి: ఈవీఎం బ్యాలట్ పేపర్ స్పష్టంగా కనిపించే విధంగా చర్యలు తీసుకుంటారు. అభ్యర్థుల కలర్ ఫొటోలను ముద్రిస్తారు. ఫారం 17సీ, ఈవీఎం డాటా మిస్‌మ్యాచ్ జరిగినపుడు తప్పనిసరిగా వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తారు. మాక్ పోల్ డాటాను చెరిపేయని సందర్భంలో కూడా వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలట్లను లెక్కించడం పూర్తయిన తర్వాత మాత్రమే ఈవీఎంలలోని తుది రెండు రౌండ్ల లెక్కింపు జరుగుతుంది.
ఏడు రాష్ర్టాల్లో ఉప ఎన్నికలు
తెలంగాణ, జమ్ముకశ్మీరు, ఒడిశా, జార్ఖండ్, మిజోరం, పంజాబ్ రాజస్థాన్లలోఎనిమిది శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే నెల 11న జరుగుతాయని జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. వచ్చే నెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక అవసరమైంది. మదర్ ఆఫ్ ఆల్ యాప్స్
రియల్ టైమ్ ఓటర్ టర్నౌట్ అప్డేట్స్ కోసం వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫాం ఈసీఐనెట్‌ను ఎన్నికల కమిషన్ ఆవిష్కరించింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ యాప్స్‌గా సీఈసీ అభివర్ణించారు. పారదర్శకత, సమర్థతలను పెంచడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణ, పరిశీలన, ఓటర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్‌ల కోసం ఉపయోగిస్తున్న 40కిపైగా డిజిటల్ టూల్స్ అన్నీ దీనిలో ఉంటాయి.
7 అంశాలే కీలకం! ఎన్నికలను ప్రభావితం చేసేవి ఇవే
పట్నా, న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ ఎన్నికలను ఏడు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. అవి..