Tejashwi Yadav : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ బీహార్ (Bihar) లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజస్వీ యాదవ్ (Tejashvi Yadav) కీలకమైన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికిపైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు అనువుగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ప్రత్యేక చట్టం తెస్తామని, 20 నెలల్లో ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని తేజస్వి ప్రతిజ్ఞ చేశారు. తాజాగా జరగిన ఓ సర్వే ప్రకారం.. బీహార్‌లోని మొత్తం 7.42 కోట్ల ఓటర్లలో 18 – 35 ఏళ్ల వారి సంఖ్య 1.60 కోట్ల వరకు ఉంది. 18 – 29 ఏళ్ల వారిలో దాదాపు 44.6 శాతం మంది ఎన్డీయే వైపు, 39.5 శాతం మంది మహాఘట్బంధన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది.
సుమారు 42 శాతం మంది బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ముందుగానే యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు.
‘ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’ పథకం కింద 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ. 4,000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ. 5,000, ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. అదేవిధంగా 2025-26 నుంచి 2030-31 వరకు రాష్ట్రం నుంచి లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్జేడీ నేత తేజస్వీ ‘ఛాత్ర యువ సంసద్’ కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యువజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను కల్పిస్తామని ప్రకటించారు. సైన్స్, గణితం, ఇంగ్లిష్‌లలో వెనుకబడ్డ విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తారన్నారు.