పాట్నా: బీహార్లో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార ఎన్డీఏ కూటమి.. ఎన్నికల్లో నెగ్గేందుకు మ్యానిఫెస్టోలో వరాల వర్షం కురిపించింది. ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం పాట్నాలో సంకల్ప్ పత్ర పేరిట ఏన్డీఏ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు రూ. 2 లక్షల చొప్పున మహిళలకు ఆర్థిక సహాయం అందచేస్తామని, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందచేస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. జానకి మాత ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి సీతాపురం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని, బీహార్లోని నాలుగు నగరాలలో మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.