పాట్నా, నవంబర్ 16 : బీహార్ ఎన్నికల ఫలితాలు లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీపైనే కాదు, వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అధికారంలోకి వద్దామని కలలు కన్న ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితం కాగా, ఈ ఎన్నికలు వారి కుటుంబంలో చిచ్చుపెట్టాయి. ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ కుమార్తె, గతంలో ఆయనకు కిడ్నీని ఇచ్చిన రోహిణి ఆచార్య శనివారం తాను రాజకీయాలకు గుడ్‌బై చెప్పడమే కాక, తన కుటుంబాన్ని వదులుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఆదివారం కూడా ఆమె వరుసగా పలు సంచలన పోస్ట్‌లు పెట్టారు. సోదరుడు తేజస్వీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ సన్నిహితులు సంజయ్, రమీజ్ నాతో బలవంతంగా ఇది చేయిస్తున్నారు. అన్ని తప్పులకు నన్ను బాధ్యులను చేయిస్తున్నా’రని ఆరోపించారు. ‘నన్ను అసభ్యకరంగా తిట్టారు, నన్ను కొట్టడానికి చెప్పులు ఎత్తారు’ అని ఆమె వాపోయారు. ‘నేను నా రాజకీయాలను వదిలేశాను. కుటుంబాన్నీ వదలుకుంటున్నాను. ఇదే చేయమని సంజయ్ యాద వ్, రమీజ్ కూడా అడిగారు. నేనే అన్ని నిందలు తీసుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. రోహిణి ఇంటి నుంచి వెళ్లిపోతానన్న తర్వాత లాలూ ప్రసాద్ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్‌లక్ష్మీ, రాగిణి, చందాలు పాట్నాలో 10 సర్క్యులర్ రోడ్లో రబ్రీ, లాలూ నివసిస్తున్న గృహాన్ని విడిచి పిల్లలతో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. జరుగుతున్న పరిణామాల పట్ల వారు తీవ్ర కలత చెందినట్టు సన్నిహితులు తెలిపారు. లాలూ దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. రోహిణి ఆరోపణలపై ఇప్పటికే పార్టీ నుంచి, కుటుంబం నుంచి వెలివేసిన ఆమె పెద్ద సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ తన సోదరి ఉదంతం హృదయాన్ని కదిలించిందని అన్నారు. తనపై ఎన్నిసార్లు దాడులు చేసినా సహించానని, కానీ సోదరిని ఇలా అవమానించడం ఎట్టి పరిస్థితుల్లో సహించ లేనని అన్నారు.
రోహిణి ఆచార్య ప్రధానంగా ఆరోపణలు చేసిన సంజయ్ యాదవ్ ఆర్జేడీ రాజ్యసభ ఎంపీయే కాక, తేజస్వీ యాదవ్‌కు అత్యంత విశ్వసనీయమైన సహాయకుల్లో ఒకరు. 2012లో ఆర్జేడీలో చేరిన ఆయన 2024లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఇక రమీజ్.. తేజస్వీ యాదవ్‌కు స్నేహితుడు. ఆయన యూపీకి చెందిన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. అయితే వాస్తవానికి వీరిద్దరూ రోహిణిని ఏం అన్నది స్పష్టం కాలేదు. దీనిపై వ్యాఖ్యానించడానికి వారిద్దరూ అందుబాటులో లేరు. తేజస్వీ యాత్ర సందర్భంగా రథంలో తేజస్వీ సీటును సంజయ్ ఆక్రమించినప్పుడు రోహిణి ఆచార్య బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య.. సోదరుడు తేజస్వి యాదవ్, అతని అనుచరులను నిందిస్తూ కుటుంబంతో సంబంధాలను తెంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తనను అసభ్యకరంగా తిట్టారని, కొట్టే ప్రయత్నంలో తనపై చెప్పు ఎత్తారని ఆమె ఆరోపించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి, కుటుంబం నుంచి విడిపోవడానికి తేజస్వీ యాదవ్ ప్రధాన అనుచరులు సంజయ్ యాదవ్, రమీజ్లే కారణమని ఆరోపించారు. ‘డబ్బుల కోసం, టికెట్ కోసం నా తండ్రికి కిడ్నీ ఇచ్చానని నన్ను ఘోరంగా అవమానించారు. దీనికి తగిన సమాధానం చెప్పాలి’ అంటూ ఆమె డిమాండ్ చేశారు.