పాట్నా : బీహార్ సీఎం నితీశ్ బుధవారం చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆయన శక్తిహీనుడయ్యారని విమర్శలు వచ్చేలా చేసింది. జేపీ గంగాపథ్ ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో నితీశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
దీనిని నిర్మిస్తున్న ప్రైవేట్ కంపెనీ అధికారితో మాట్లాడుతూ, ‘కావాలంటే చెప్పండి, మీ కాళ్లకు మొక్కుతాను’అని అన్నారు. దీంతో బిత్తరపోయిన ఆ అధికారి స్పందిస్తూ, ‘సార్, అలా చేయకండి’ అంటూ వెనుకకు వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి నితీశ్ శక్తిహీనుడయ్యారని, అందుకే ఆయన అందరి కాళ్లపైన పడటానికి సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు.