న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసంలో వీరి భేటీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే లక్ష్యంతో బీహార్ సీఎం నితీశ్ ఎన్డీయేయేతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి ఢిల్లీలో కేజ్రివాల్ నివాసానికి వెళ్లారు.
ఢిల్లీ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను ఎలా లాక్కుంటుందని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ విషయంలో తాము ఢిల్లీ ప్రజలకు, అరవింద్ కేజ్రివాల్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. తాము దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
ఢిల్లీలో అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. కేంద్రం ఆ తీర్పునకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, ఒకవేళ కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకొస్తే రాజ్యసభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయని కేజ్రివాల్ అన్నారు. అదేగనక జరిగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అది ఒక సంకేతంగా భావించవచ్చని ఆయన చెప్పారు.