పాట్నా: బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తానే హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాననే విషయం మర్చిపోయి అధికారులను గందరగోళానికి గురిచేశారు. హోంమంత్రిని పిలవండి! అంటూ ఆయన పదేపదే చెప్పడంతో.. ఎవరికి ఫోన్ చేయాలో తెలియక అధికారులు బిక్కమోహం వేశారు. తాజాగా నిర్వహించిన జనతాదర్బార్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫిర్యాదుల పరిశీలన క్రమంలో ‘హోంమంత్రిని పిలువండి’ అంటూ సీఎం సూచించారు. ‘ఆయనే కదా హోంశాఖను కూడా చూస్తున్నది’ అని అధికారులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఎవరికి ఫోన్ చేయాలి? అని అధికారులు రెండు సార్లు అడగడంతో విసుగు చెందిన సీఎం నితీశ్.. హాల్లో కూర్చొన్న మంత్రి విజయ్ చౌదరిని చూపిస్తూ ‘హోంమంత్రిని పిలువండి. నా పక్కన కూర్చోమనండి’ అని అన్నారు. దీంతో సదరు అధికారి విజయ్ చౌదరికి ఫోన్ చేసి నితీశ్‌కు ఇవ్వగా.. ‘మీరు ఎవరికి ఫోన్ చేశారు? ఇతను కాదు’ అంటూ సీఎం మరోసారి తడబడ్డారు. ఈ ఎపిసోడ్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.