Bihar Student | ముజఫర్‌పూర్, డిసెంబర్ 18 : బీహార్‌కు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కోటీశ్వరుడైపోయాడు. బ్యాంకు ఖాతాలోని సుమారు 87 కోట్ల నగదు నిల్వ అతడిని ఐదు గంటల పాటు కోటీశ్వరుడిగా ఉంచింది. విచిత్రమైన ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అలీ తన ఖాతాలో రూ.500 విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అయితే బ్యాలెన్స్ ఎంత ఉందో పరిశీలించగా, స్క్రీన్‌పై మొత్తాన్ని చూసి షాకయ్యాడు.
అతని ఖాతాలో 87.65 కోట్ల నగదు ఉన్నట్టు చూపడంతో తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అనుమానంతో కొంత సేపాగిన తర్వాత మళ్లీ చూడగా, అదే మొత్తాన్ని చూపింది. దీంతో అతడు పరుగున ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పాడు. ఆమె పొరుగున ఉన్న ఒక వ్యక్తికి చెప్పడంతో ఆయన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చూడగా, అతని ఖాతాలో రూ.532 మాత్రమే ఉన్నట్టు చూపింది. అంతేకాకుండా కొద్ది సేపటి తర్వాత ఆయన ఖాతా స్తంభించిపోయింది. అనంతరం దీనిపై బ్యాంక్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంక్ విచారణ జరుపుతున్నది.