Sanjay Jaiswal : ‘మర్యాదగా రూ.10 కోట్లు ఇస్తావా.. లేదంటే నీ కొడుకును చంపేయమంటావా..?’ అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బీహార్ (Bihar) కు చెందిన బీజేపీ (BJP) సీనియర్ నేత, ఎంపీ (MP) సంజయ్ జైశ్వాల్ (Sanjay Jaiswal) కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
బాధిత ఎంపీ ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని సబ్ డివిజినల్ పోలీస్ అధికారి వివేక్ దీప్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎంపీకి రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఆయన శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాల్ చేసిన వ్యక్తి రూ.10 కోట్లు అడిగాడని, లేదంటే తన కొడుకును చంపేస్తానని బెదిరించాడని ఎంపీ పోలీసులకు తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎంపీని బెదిరించిన వ్యక్తికి క్రిమినల్ ముఠాలతో సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ బెదిరింపుల వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పోలీసులు పేర్కొన్నారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సంజయ్ జైశ్వాల్ ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్‌గా ఉన్నారు.