న్యూఢిల్లీ: సెలబ్రెటీ కాల్పుల్లో ఒక వైద్యురాలు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. విచారణ జరిపిన కోర్టు ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయే అవకాశమున్నది. (BJP MLA gets jail term) 2018 డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఫామ్‌హౌస్‌లో బీహార్‌కు చెందిన రాజూ కుమార్ సింగ్ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో డాక్టర్ అర్చన గుప్తాకు బుల్లెట్ గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజూ కుమార్ సింగ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో 8 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగింది. ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు తాజాగా శిక్షలు ఖరారు చేసింది. నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు, ఆయుధాల చట్టం కింద అదనంగా రెండు నెలల శిక్షను కూడా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమైతే, అదనంగా మరో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు రాజూ కుమార్ సింగ్ ప్రస్తుతం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా సాహెబ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ’ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు.
కాగా, సింగ్‌కు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడటంతో ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’ నిబంధనల ప్రకారం ఆయన శాసనసభ సభ్యత్వం రద్దయ్యే లేదా అనర్హతకు గురయ్యే అవకాశం ఉన్నది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఆయన నేర నిర్ధారణపై లేదా శిక్షపై స్టే విధిస్తే ఉపశమనం లభించవచ్చు. లేనిపక్షంలో సాహెబ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.