పాట్నా: ప్రస్తుతం హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం మెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ ఘటన జరిగింది. ఒక ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్‌లోని యూకో (యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిజాబ్‌ను తీసివేయాలంటూ వాదనకు దిగారు. ఆమెను డబ్బులు డ్రా చేయనీవ్వలేదు.
అయితే, హిజాబ్ తీసివేసేందుకు ఆ ముస్లిం యువతి నిరాకరించింది. వెంటనే తన తల్లిదండ్రులను బ్యాంకుకు పిలిచింది. దీంతో బ్యాంకు వద్దకు వచ్చిన ఆమె తండ్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. హిజాబ్ ధరిస్తే బ్యాంకులోకి ప్రవేశం లేదన్న నోటీసు ఉందా అని ప్రశ్నించారు. అలాంటి ఉత్తర్వు ఉంటే తమకు చూపించాలని ఆయన అడిగారు. తన కుమార్తె, తాను ప్రతి నెలా బ్యాంకుకు వస్తుంటామని, అయితే ఎప్పుడూ కూడా ఇలా జరుగలేదని ముస్లిం యువతి తండ్రి తెలిపారు. కర్ణాటకలో అమలు చేస్తున్న ఇలాంటి వాటిని బీహార్‌లో ఎందుకు అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాగా, ఆ యువతి తన మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా దీనిని షేర్ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆయన మండిపడ్డారు. మీ సీఎం పదవిని కాపాడుకునేందుకు ఎంత వరకు వెళ్తారు? అని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరు, మీ భావజాలాన్ని, విధానాలను, నైతిక బాధ్యతను, మనస్సాక్షిని బీజేపీ ముందు తాకట్టు పెట్టారన్న సంగతి అర్థమైదంటూ దుయ్యబట్టారు. కనీసం రాజ్యాంగాన్ని అయినా గౌరవించాలని సూచించారు. ఆ బ్యాంకు ఉద్యోగులను అరెస్టు చేయాలని ఆ ట్వీట్లో డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై యూకో(యూసీవో) బ్యాంకు స్పందించింది. పౌరుల మతపరమైన మనోభావాలను తాము గౌరవిస్తామని తెలిపింది. కులం లేదా మతం ఆధారంగా వినియోగదారుల పట్ల వివక్ష చూపబోమని పేర్కొంది. బ్యాంకు శాఖలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
माननीय मुख्यमंत्री @NitishKumar जी,
कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022