Heat Waves | బిహార్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఎండలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం పది దాటిందంటే బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండలకు దెబ్బతో 16 మంది మృతి చెందారు. తీవ్రమైన ఎండలతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా 337 మంది బుధవారం అస్వస్థతకు గురయ్యారు. మరో వైపు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
పలుచోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఎండలతో ఒకేసారి పెద్ద ఎత్తున విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో అంతరాయం కలుగుతుంది. అయితే, గృహోపకరాలను ఒకేసారి వాడొద్దని విద్యుత్ శాఖ సూచించింది. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే బోరు మోటార్లు, ఐరన్, వాషింగ్ మిషన్లు వినియోగించుకోవాలని కోరింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్రిజ్‌లు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏసీలను నిరంతరాయంగా వాడొద్దని.. ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో 48 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.