Hemant soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జార్ఖండ్ హైకోర్టులో కొనసాగుతున్న లీజు కేటాయింపు కేసును నిర్వహించదగినది కాదని సుప్రీంకోర్టు పరిగణించింది. హేమంత్‌తోపాటు జార్ఖండ్ సర్కార్ చేసుకున్న అప్పీళ్లను సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. అలాగే, జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఇదే కేసులో దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను హేమంత్ సోరేన్ రెండు రోజుల క్రితం సవాల్ చేశారు.
హేమంత్ సోరేన్ తన సన్నిహితుల ద్వారా షెల్ కంపెనీకి మైనింగ్ లీజు కేటాయింపు, పెట్టుబడికి సంబంధించిన పిటిషన్‌గా ఈ కేసును జార్ఖండ్ హైకోర్టు పరిగణించింది. దాంతో హైకోర్టు తీర్పుపై జార్ఖండ్ ప్రభుత్వంతోపాటు హేమంత్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ అప్పీల్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 17న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. హేమంత్ సోరేన్‌తో పాటు జార్ఖండ్ ప్రభుత్వం చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు పేర్కొన్న సుప్రీంకోర్టు.. జూన్ 3 న హైకోర్టు జారీ చేసిన ఆర్డర్‌ను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది.
మైనింగ్ లీజు కోసం తాను చాలా ఏండ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నానని సీఎం హేమంత్ సోరెన్ తన పిటిషన్లో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను ఎలాంటి లాభదాయకమైన ఏ పదవిని కూడా నిర్వహించలేదని కోర్టుకు విన్నవించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ లీజును కూడా సరెండర్ చేశానని, అలాగే అక్కడ ఎలాంటి మైనింగ్ జరగలేదని తెలిపారు. అందువలన లాభదాయకమైన పదవిని దుర్వినియోగం చేసిన విషయం తలెత్తదని, తమను అనర్హులుగా ప్రకటించలేరని హేమంత్ సోరేన్ వాదించారు. సుప్రీంకోర్టులో తనకు ఊరట లభించిన అనంతరం సత్యమేవ జయతే అని హేమంత్ సోరేన్ తనను కలిసిన మీడియా వారితో వ్యాఖ్యానించారు.