Goa nightclub fire : గోవా (Goa) లోని బిర్చ్ నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోవడంపై పోలీసులు చర్యలకు దిగారు. నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రాలపై భారతీయ న్యాయసంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. క్లబ్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
2013లో ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసిన రోషన్ రెడ్కార్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశ మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండే స్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక విచారణలో వెల్లడికావడంతో పోలీసులు తాజా చర్యలకు దిగారు.
భద్రతా నియమాల ఉల్లంఘన జరిగినప్పటికీ క్లబ్ నిర్వహణకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. కాగా అనుమతి లేకుండా నైట్‌క్లబ్ నిర్మాణం జరిగిందని, క్లబ్‌ను కూల్చేవేసేందుకు నోటీసులు జారీ చేసినప్పటికీ దానిపై హైయర్ అథారిటీ స్టే ఇచ్చిందని విలేజ్ అధికారి ఒకరు తెలిపారు.
శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగినప్పుడు నైట్‌క్లబ్‌లో సుమారు 100 మంది వరకు ఉన్నారని, సిలిండర్ పేలడంవల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మంటలు చెలరేగగానే పలువురు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరుగులు తీశారని, ప్రవేశద్వారం ఇరుకుగా ఉండటంతో వంటగదిలోనే చిక్కుకుపోయారని పోలీసులు చెప్పారు. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. మరో ఏడుగురిని గుర్తించాల్సి ఉందన్నారు.