Supreme Court | దాదాపు ఆరేళ్ల కిందట జరిగిన మరణాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో తమిళనాడులోని కురంగణి కొండల్లో 13 మంది మృతికి సంబంధించి బెల్జియం జాతీయుడు పీటర్ వాన్ గీత్పై తమిళనాడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. సుప్రీంకోర్టు రద్దు చేసింది. ట్రెక్కింగ్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 13 మంది మరణించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఏజీ మహీస్ ధర్మాసనం బెల్జియం పౌరుడికి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అంతకు ముందు మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ఆగస్టు 20న బెల్జియం పౌరుడి ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. బెల్జియం జాతీయుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ట్రెక్కింగ్‌కు వెళ్లిన వారు దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకున్నారని ధర్మాసనం పేర్కొంది. ఎన్జీవో అధినేత కావడంతో ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడంలో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని, ఘటన ప్రమాదం మాత్రమేనని, ఇందులో పిటిషనర్ నిర్లక్ష్యం, నేర ఉద్దేశం లేదన్నారు. సహజ కారణాలతో అడవుల్లో మంటలు చెలరేగాయని ధర్మాసనం పేర్కొంది.
2018లో జరిగిన ఘటనలో 13 మంది మృతి చెందారు. 12 మార్చి 2018న జరిగిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ట్రెక్కింగ్ యాత్రలో పాల్గొన్న వ్యక్తులు అడవి మంటల్లో చిక్కుకున్నారని, వారు ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా సఫలం కాలేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇదిలా ఉండగా.. తమిళనాడు కొలుక్కుమలై జిల్లా కురంగిణి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు పలువురిని రెండు గ్రూపులుగా తరలించారు. ఇందులో 20 మందికిపైగా ప్రాణాలతో బయటపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.