న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్, పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Polls) తన నియోజకవర్గం నుంచి కపిల్ మిశ్రాను పోటీకి దించడంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద తప్పని విమర్శించారు. 1998 నుంచి వరుసగా కరవాల్ నగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్, 2015లో తప్ప అన్నిసార్లు అక్కడ విజయం సాధించారు.
కాగా, 2015లో ఆప్ నుంచి గెలిచి 2019లో పార్టీ మారిన కపిల్ మిశ్రా పేరును కరవాల్ నగర్ స్థానంలో తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్ద తప్పు చేసిందని విమర్శించారు. తాను వేరే స్థానానికి మారబోనని స్పష్టం చేశారు. ‘ఎవరినైనా పోటీకి దింపితే వారు గెలుస్తారని బీజేపీ అనుకుంటున్నది. ఇది పెద్ద తప్పు. బురారి, కరవాల్ నగర్, ఘోండా, సీలంపూర్, గోకల్‌పురి, నంద్ నగరి స్థానాల్లో ఏమి జరుగుతుందో కాలమే చెబుతుంది. నేను వేరే ఏ స్థానం నుంచి పోటీ చేయను. జనవరి 17 లోపు కరావాల్ నగర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేస్తా’ అని అన్నారు.
మరోవైపు ఈసారి ఎన్నికల్లో తాను భారీ విజయం సాధిస్తానని మోహన్ సింగ్ బిష్ట్ ధీమా వ్యక్తం చేశారు. తన నియోజక వర్గం ప్రజలు దీని పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. అయితే ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.