న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. యూపీలో కాషాయ పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజేపీ పాలనలో యూపీ ప్రజలు భయం నీడన బతుకుతున్నారని, కాషాయ కూటమి నియంతల పార్టీ అని ఆయన అభివర్ణించారు. ప్రశ్నించిన వారిని, అసమ్మతి గళాలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు.
యూపీలో ఎస్పీ, బీఎస్పీలు బీజేపీకి అనుకూలంగా రాజీపడినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించారు. రెండేండ్ల కిందట యూపీ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ చేపట్టినప్పటి నుంచి పరిస్ధితులు మారాయని అన్నారు.యూపీలో క్షేత్రస్ధాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రియాంక గాంధీ కష్టపడుతున్నారని చెప్పారు. యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతోనే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కితీసుకుందని ఆరోపించారు.