న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. అక్కడ కేవలం 0.19% శాతం పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల పరిధిలో 1,47,000 చదరవు కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నాయి. ఆరావళి పర్వతాల పరిధిని నిర్దేశించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ వ్యవహారం 1985 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఆరావళి పరిధి నాలుగు రాష్ర్టాల్లో ఒకే నిర్వచనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పర్వతాల కింది నుంచి పైభాగం వరకు 100 మీటర్ల వరకు విస్తరించి ఉంటాయని, రెండు పర్వతాల మధ్య ప్రదేశాన్ని కూడా ఆరావళిగానే పరిగణించాల్సి ఉంటుందని వివరించారు.