UP Polls : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీలో జోష్ నెలకొంది. కాషాయ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో ఎస్పీలో చేరుతుండగా తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమవడంతో పలు ఊహాగానాలు సాగుతున్నాయి.
చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ యూపీ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేస్తుందని ప్రచారం సాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు అఖిలేష్ పలు చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. అఖిలేష్, చంద్రశేఖర్ ఆజాద్ భేటీతో ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు పొడుస్తుందని భావిస్తున్నారు.
యోగి ఆదిత్యానాధ్ క్యాబినెట్ నుంచి స్వామి ప్రసాద్ మౌర్య, ధరం సింగ్ సైనీ వంటి ఓబీసీ నేతలు రాజీనామా చేసిన తర్వాత యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక ఫిబ్రవరి 7 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.