
BMS Protests | ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో వాటాల ఉపసంహరణకు వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఈ నెల 28న దేశవ్యాప్త నిరసన తెలుపనున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కార్మిక సంఘాలు మౌనంగా ఉన్నాయని బీఎంఎస్ అఖిలభారత కార్యదర్శి గిరీశ్ చంద్ర ఆర్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఎంఎస్ 28న దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించిందని శనివారం తెలిపారు.
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారన్న అంశంతో సంబంధం లేదని గిరీశ్ చంద్ర ఆర్య పేర్కొన్నారు. మంచి డివిడెండ్లు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం ఎందుకు వాటాలు ఉపసంహరిస్తుందని ప్రశ్నించారు. ఎన్హెచ్పీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ సహా స్టీల్, టెలికం, పవర్, బ్యాంకింగ్, బీమారంగ ఉద్యోగులను తమ ఆందోళనలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.