న్యూఢిల్లీ: కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.
ఈ సేవలు డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. వచ్చే నెలలో 650 మంది డ్రైవర్లతో ఈ సేవలు ముందుగా ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నాటికి 5 వేల మంది డ్రైవర్లు, మహిళా సారథుల (డ్రైవర్లు)తో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇది సభ్యత్వ ఆధారిత మోడల్.