న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ నంబర్ చేంజ్ స్కామ్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా స్కామ్‌లు ఇటీవల ఎక్కువ అవుతున్నాయని.. స్కామర్లు సీనియర్ సిటిజన్లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా స్కామర్లు మొదట బాధితుల పింఛను చెల్లింపు ఆర్డర్(పీపీవో)ను త్వరగా ప్రాసెసింగ్ చేస్తామని లేకపోతే పెన్షన్ విడుదల నిలిచిపోతుందని బెదిరిస్తారు.
దీంతో బాధితులు భయంతో తమ బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆర్థిక వివరాలు స్కామర్లకు తెలియజేసి వారు చెప్పిన యాప్‌లను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ యాప్‌ల సాయంతో స్కామర్లు బాధితుల ఫోన్లోకి మాల్వేర్ జొప్పించి వారి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని వారి బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ స్థానంలో తమ ఫోన్ నంబర్‌ను పొందుపరుస్తారు. ఆ తర్వాత వారి ఖాతాలోని నగదును కాజేస్తారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం కోరుతూ, యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతూ ఎవరైనా కాల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.