న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్యుటెక్) సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా సంస్థలు ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేసే శిక్షణ, ట్యుటోరియల్స్, పోటీ పరీక్షల కోచింగ్, ఇతర కంటెంట్‌ను ఎంపిక చేసుకునే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని సంస్థల ఉచిత సర్వీస్ ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఉచిత కోర్సుల ముసుగులో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ఆటో డెబిట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తున్నారని, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్ఫర్(ఈఎఫ్‌టీ) అనుమతి పొందుతుండడం స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం దృష్టికి వచ్చిందని తెలిపింది. సబ్స్క్రిప్షన్ కోసం ఆటోడెబిట్ ఫీచర్ ఇవ్వొద్దని.. వారి నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదవాలని సూచించింది. లోన్ సదుపాయం కల్పిస్తామంటూ వచ్చే ప్రకటనలను కూడా గుడ్డిగా నమ్మొద్దని స్పష్టం చేసింది.