E-Notices | న్యూఢిల్లీ, జూలై 14: ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమానిత రీతిలో ఈ-మెయిల్ వస్తే అందులోని అధీకృత అధికారి పేరు, విభాగాన్ని ధ్రువీకరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ప్రజలను కోరింది. ఈ-నోటీసుల పేరిట పదే పదే వచ్చే నకిలీ-ఈ మెయిళ్లను నమ్మి సైబర్ మోసాల బాధితులుగా మారొద్దని హెచ్చరించింది. ఇలాంటి మెయిళ్లను చెక్ చేసేముందు అవి gov.inతో అంతమయ్యే అధీకృత ప్రభుత్వ వైబ్సైట్ నుంచి వచ్చాయా లేదో సరి చూసుకోవాలని కోరింది.
అనుమానం వస్తే ఇంటర్నెట్లో సంబంధిత అధికారి పేరు సరైందో కాదో చెక్ చేసి సంబంధిత విభాగానికి ఫోన్ చేసి కనుక్కోవాలని సూచించింది. వివిధ ఈ-మెయిల్ అడ్రస్సులతో వచ్చే నకిలీ నోటీసులకు స్పందించొద్దని.. వాటి గురించి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేయొచ్చని తెలిపింది. గత వారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సచివాలయంలోని పలువురు అధికారులకు ఈ తరహా నకిలీ ఈ-నోటీసులు వచ్చాయని చెప్పింది.