బెంగళూరు: ఒక మహిళ గుడి పూజారిపై ఉమ్మింది. దీంతో ఆగ్రహించిన ఆలయ సిబ్బంది ఆమెను కొట్టడంతోపాటు గుడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ స్థానికంగా ఉన్న గుడికి వెళ్లింది. వెంకటేశ్వర స్వామి భార్యగా పేర్కొన్న ఆమె స్వామివారి విగ్రహం పక్కన కూర్చొనేందుకు ప్రయత్నించింది. దీంతో పూజారి అడ్డుకోగా ఆయనపై ఉమ్మి వేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆలయ సిబ్బంది ఆ మహిళను కొట్టారు. ఆపై ఆమె జుట్టు పట్టుకుని గుడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు.
కాగా, డిసెంబర్ 21న జరిగిన ఈ సంఘటనపై ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో గుడిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఆ మహిళను కొట్టి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆలయ సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. మరోవైపు గుడిలో ఆమెను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.