న్యూఢిల్లీ, జూలై 19: ఇంటి నుంచి కాలు బయటపెట్టిన మహిళకు వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. బెంగళూరుకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి మాత్రం ఒకే రోజు తాను ఎదుర్కొన్న రెండు వేధింపు ఘటనలను రెడిట్ ద్వారా పంచుకున్నారు. మొదటి ఘటన తాను తన కుటుంబంతో కలసి తన తండ్రి కారులో ఇంటికి వెళుతుండగా కేఆర్ పురం వద్ద ట్రాఫిక్‌లో గంటకు పైగా చిక్కుకున్నప్పుడు జరిగిందని ఆమె తెలిపారు. పక్కనే ఆగి ఉన్న కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఓ వ్యక్తి తనను చూసి ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్నట్లు సైగ చేశాడని, అది చూసి తాను షాక్‌కు గురయ్యానని ఆమె తెలిపారు.
ఏం చేయాలో పాలుపోక మొహం తిప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక రెండో సంఘటన అదే రోజు రాత్రి జరిగిందని ఆమె వెల్లడించారు. తన ఇంటికి వచ్చిన ముక్కూ మొహం తెలియని డెలివరీ ఏజెంట్ తనను చూసి కన్ను గీటాడని ఆమె తెలిపారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరిని చూస్తుంటే గుండె మండిపోతోందని ఆ యువతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.