Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. అప్పు చెల్లించడం లేదన్న కారణంతో ఒక మహిళను కిడ్నాప్ చేసి, వేధింపులకు పాల్పడ్డారు. నాలుగు రోజులు నిర్బంధించి, అర్ధనగ్న వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చంద్ర లేఔట్ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ నెల 31న నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బెంగళూరులో ఉంటున్న ఒక 30 ఏళ్ల మహిళ.. నజాత్ బేగం నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుంది. దీనికి ప్రతివారం ఈఎంఐ చెల్లించాలి.
అలాగే, రేష్మ బాను అనే మరో మహిళ నుంచి రూ.1,00,000 తీసుకుంది. దీనికి రెండేళ్లపాటు నెలవారీ వడ్డీ చెల్లించాలి. అయితే, అప్పు తీసుకున్న మహిళ కొన్ని వారాలుగా ఈఎంఐ కట్టలేకపోయింది. దీంతో అప్పు ఇచ్చిన నజత్ అనే మహిళ.. బాధిత యువతిని ఆగష్టు 27న మెట్రో లేఔట్‌లోని తన ఇంటికి పిలిపించుకుంది. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, దీంతో తన డబ్బు చెల్లించవచ్చని నమ్మించి తన ఇంటికి రప్పించుకుంది. అదే రోజు సాయంత్రం ఆ మహిళ తన కొడుకుతో కలిసి.. నజత్ బేగం ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లే సరికి రేష్మ భాను, ఆమె భర్త సుహేల్, మరో ఇద్దరు అక్కడికి వచ్చారు.
ఆ ఇంట్లోనే ఆమెను బంధించారు. తమ అప్పు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. వడ్డీతో కలిసి రూ.11 లక్షలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకపోతే కత్తితో పొడిచి చంపేస్తామని బెదిరించారు. ఆమె దగ్గరున్న మొబైల్ ఫోన్‌ను తీసుకుని, పగులగొట్టారు. ఆ తర్వాత ఆ మహిళను, ఆమె కొడుకును బెదిరించి రాత్రి పూట ఆటోలో కుంబలగోడు ప్రాంతంలోని మరో ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒక అపార్ట్మెంట్లో బంధించారు. అక్కడ కర్రతో ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆగష్టు 29న రేష్మ భర్త, ఇతర నిందితులు కలిసి ఆమె దుస్తులు విప్పించి, అర్ధనగ్నంగా మొబైల్‌తో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు.
అంతేకాదు.. తన డబ్బు చెల్లించకపోతే ఆ వీడియో వైరల్ చేస్తామని హెచ్చరించారు. తమ డబ్బు రాబట్టుకునేందుకు ఆమెను వ్యభిచారంలోకి దింపుతామని బెదిరించారు. అదే రోజు ఆమె కొడుకును విడిచిపెట్టారు. దీంతో తన కొడుకును వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లాలని ఆమె సూచించింది. అయితే, ఆమెను మాత్రం ఇంకా అక్కడే నిర్బంధించి ఉంచారు. తర్వాత ఆగష్టు 30న ఆమెను ఒక లాయర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కొన్ని తెల్ల పేపర్లపై సంతకాలు పెట్టించుకుని, తిరిగి తీసుకొచ్చి మళ్లీ నిర్బంధించారు.
అక్కడ ఆగష్టు 31న టాయిలెట్‌కు వెళ్లేందుకు రేష్మ ఆమె రూం తలుపులు తీసింది. దీంతో ఇదే అదనుగా భావించిన బాధిత మహిళ అక్కడినుంచి తప్పించుకుంది. బయటకు వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.