బెంగళూరు: సహజీవనం తప్పమ్మా? ఇన్ని లక్షల అప్పు ఎందుకు చేశావ్? అంటూ ప్రశ్నించిన తల్లిదండ్రులపై పెద్ద కుమార్తె కక్ష గట్టింది. కనీపెంచిన అమ్మానాన్న, తోడబుట్టిన చెల్లెల్ని.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్యగావించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు, చెల్లెలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే.. తన ప్రియుడితో కలిసి పెద్ద కుమార్తె వారి ప్రాణాలు తీసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన సోమవారం బెంగళూరులో చోటుచేసుకుంది. కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీగెహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తు లక్ష్మి(48), చిన్న కుమార్తె సుప్రియ(20) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబంలోని పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. శ్వేత కొంత కాలంగా కెన్నెత్తో సహజీవనం చేస్తున్నది. తీరు మార్చుకోవాలని తల్లిదండ్రులు ఆమెను మందలించారు.