Bengaluru techie : బెంగళూరులో ఇటీవల జరిగిన యువతి మృతి ఘటన కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణమో, ఆత్మహత్యో కాదని, హత్య అని తేలింది. హత్య చేసింది ఎదురింట్లో ఉండే 18 ఏళ్ల కర్నాల్ కురాయ్ అనే యువకుడిగా పోలీసులు తేల్చారు. బెంగళూరులోని రామమూర్తి పరిధిలోని సుబ్రమణి లే ఔట్ లోని అపార్ట్ మెంట్లో డీకే షర్మిల అనే 34 ఏళ్ల యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉండేది. ఈ నెల 3న ఆమె తన ఫ్లాట్లో మరణించింది.
అక్కడి పరిస్తితులు చూస్తే.. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఊపిరాడక మరణించిందని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్కడి ఫోరెన్సిక్ నివేదిక, సైంటిఫిక్ ఆధారాల వల్ల అది సహజ మరణం కాదని, హత్య అని తేలింది. దీంతో అనుమానాస్పద వ్యక్తుల్ని విచారించగా.. షర్మిల ఇంటి ఎదురింట్లోనే ఉండే కర్నాల్ కురాయ్ అనే యువకుడు హత్య చేసినట్లుగా అంగీకరించాడు. అయితే, హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 3న షర్మిల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గుర్తించిన కర్నాల్ రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి కిటికీ ద్వారా చొరబడ్డాడు. తనతో సెక్స్ కు ఒప్పుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆమెను ఆమెపై దాడి చేసి, ఊపిరాడకుండా చేశాడు. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు.
అనంతరం గొంతు కోయడంతో రక్తస్రావం కూడా జరిగి, ప్రాణాలు కోల్పోయింది. తను షర్మిలను హత్య చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు నమ్మించేలా మంటలు అంటించాడు. ఆమె దుస్తులు, ఇతర వస్తువులు ఇంట్లో కాలిపోయేలా చేశాడు. తర్వాత ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో మంటలు గమనించి చుట్టుపక్కల వాళ్లు వచ్చి, మంటలు ఆర్పి చూసేసరికి షర్మిల ప్రాణాలు కోల్పోయి కనిపించింది. దీంతో ఆమె అగ్ని ప్రమాదం వల్లే మరణించి ఉండొచ్చని ముందు అందరూ భావించారు. కానీ, చివరకు పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపి, హత్య అని తెలిసి, నిందితుడిని పట్టుకున్నారు.