బెంగళూరు: నేరాలకు పాల్పడిన వారిపై సొంత విచారణ జరిపి జరిమానాలు విధిస్తూ నేర న్యాయ వ్యవస్థను అతిక్రమించిన ఓ నివాస అపార్ట్మెంట్ అసోసియేషన్, దాని ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్‌పై బెంగళూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నేరాలకు పాల్పడిన తమ అపార్ట్మెంట్లో నివసించే కొందరిపై తామే విచారణ జరిపి, తామే శిక్షలు, జరిమానాలు విధిస్తున్న ప్రావిడెంట్ సన్‌వర్త్ అసోసియేషన్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కు సెక్యూరిటీ సర్వీసులను అందచేస్తున్న టైకో సెక్యూరిటీపై కుంబల్గోడు పోలీసులు కేసు నమోదు చేశారు. నైరుతి బెంగళూరులోని దొడ్బబేలేలో ఉన్న ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇందులో నివసించే పలువురు అపార్ట్మెంట్ ప్రాంగణంలో, సమీప ప్రాంతాలలో చిన్న చిన్న తప్పుల నుంచి లైంగిక దాడి, చోరీ, మాదకద్రవ్యాల సేవనం, డ్రగ్స్ కలిగి ఉండడంతోసహా తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు వారు చెప్పారు. ఈ ఘటనలపై పోలీసులకు సమాచారం అందచేయాల్సింది పోయి అపార్ట్మెంట్ అసోసియేషన్ తానే సొంతంగా చట్టాలను రూపొందించుకుని, అంతర్గతంగా నిందితులను ప్రశ్నించి, జరిమానాలు విధించి, నిందితులు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించిందని పోలీసులు చెప్పారు.