బెంగళూరు: లైంగికదాడి కేసుల్లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం దోషిగా నిర్ధారించింది. రేవణ్ణకు మొత్తం నాలుగు కేసుల్లో శనివారం శిక్ష ఖరారు చేయనున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సంతోష్ గజానన్ భట్ తెలిపారు. కోర్టు తీర్పు వినగానే న్యాయస్థానంలో ప్రజ్వల్ కంటతడి పెట్టారు. హసన్ జిల్లాలోని హూలేనరసిరపురలోని గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏండ్ల పనిమనిషిపై రేవణ్ణ కొవిడ్ సమయంలో 2021లో రెండుసార్లు లైంగిక దాడి చేశారు. అంతేకాక ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రేవణ్ణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ఆయన తరఫున ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో మహిళలపై ప్రజ్వల్ సాగించిన లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం, విస్త్రృతంగా ప్రచారం కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రేవణ్ణపై లైంగిక దాడి, లైంగిక వేధింపులు తదితర నాలుగు వేర్వేరు కేసులను సిట్ నమోదు చేసింది. అప్పటికే ఆయన జర్మనీకి పారిపోయారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయనను గత ఏడాది మే 31న అరెస్ట్ చేశారు. దీంతో గత 14 నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు.
విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఆ వీడియోలో ఉన్నది ప్రజ్వలే అని నిర్ధారించాయి. హసన్ ఎంపీ సీట్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైన రేవణ్ణను తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పనిమనిషిపై అత్యాచార ఘటనే కాదు, ఆయనపై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. హసన్‌లోని అతని ఫామ్‌హౌస్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. సాక్షాత్తు ప్రజ్వలే పలు వీడియోలను చిత్రీకరించినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.