బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఖరీదైన కారును ర్యాష్‌గా డ్రైవ్ చేసింది. సిగ్నల్‌ను జంప్ చేసింది. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు, సిగ్నల్ జంప్ చేసినందుకు ఆమెకు జరిమానా విధించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావలి కూమార్తె, గురువారం వైట్ బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది. నగరంలోని కాఫీ బోర్డు సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ పడినప్పటికీ కారును ఆపలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు.
కాగా, సీటు బెల్ట్ కూడా పెట్టుకోని బీజేపీ ఎమ్మెల్యే కూతురు, ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగింది. ఈ సంఘటనను రికార్డు చేసిన మీడియా సిబ్బందిపైనా ఆమె దురుసుగా ప్రవర్తించింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు సిగ్నల్‌ను జంప్ చేసినందుకు ఆమెకు జరిమానా విధించారు. ఫైన్ కట్టిన తర్వాతే విడిచిపెట్టారు.